Dry Fruits: జమ్మూ డ్రైఫ్రూట్ విపణిని తాకిన ఆఫ్ఘన్ సంక్షోభం
- ఆఫ్ఘన్ లో తాలిబన్ పాలన
- నిలిచిన డ్రైఫ్రూట్ దిగుమతులు
- జమ్మూలో ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్ ధరలు
- కొనే పరిస్థితి లేదంటున్న ప్రజలు
ఆఫ్ఘనిస్థాన్ లో ఏర్పడిన అస్థిర రాజకీయ పరిస్థితుల ప్రభావం జమ్మూలోని డ్రైఫ్రూట్ మార్కెట్ పై పడింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి బాదం పప్పులు, అంజూర, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్ అనేక దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. నాణ్యమైన డ్రైఫ్రూట్స్ కు ఆఫ్ఘనిస్థాన్ పెట్టిందిపేరు. భారత్ లోని జమ్మూ ప్రాంతంలోనూ ఆఫ్ఘన్ నుంచి అత్యధికంగా ఎండు ఫలాలను దిగుమతి చేసుకుంటారు. కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ కేవలం ఆఫ్ఘన్ నుంచే దిగుమతి అవుతుంటాయి.
అయితే, ఆఫ్ఘనిస్థాన్ లో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో జమ్మూకు దిగుమతులు నిలిచిపోయాయి. దాంతో ఇక్కడి మార్కెట్లో డ్రైఫ్రూట్స్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పర్యవసానంగా కొనేవాళ్లు లేక వ్యాపారులు నష్టాల పాలవుతున్నారు. గతం వారం రోజులుగా జమ్మూ డ్రైఫ్రూట్ మార్కెట్లో అమ్మకాలు పడిపోయాయి.
దిగుమతులు లేక ధరలు పెంచామని చెబుతున్నా తమ కస్టమర్లు వినిపించుకోవడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. పండుగల సీజన్ లో ఇది తమకు విఘాతం వంటిదని శాంతి గుప్తా అనే డ్రైఫ్రూట్ దుకాణదారు వెల్లడించారు.
ఇక, వినియోగదారుల విషయానికొస్తే... ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి డ్రైఫ్రూట్స్ ఎంతో ఉపకరిస్తాయని, కానీ వాటి ధరలు చూస్తే మండిపోతున్నాయని విచారం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా సంక్షోభ సమయంలో డ్రైఫ్రూట్స్ వ్యాపారం జోరుగా సాగింది. అయితే ఆఫ్ఘన్ సంక్షోభం కాస్తా ఈ వ్యాపారంపై గట్టి దెబ్బకొట్టింది. ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే, తమ వ్యాపారం దారుణంగా దెబ్బతినడం ఖాయమని జమ్మూలోని డ్రైఫ్రూట్ రిటైల్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు జ్యోతి గుప్తా పేర్కొన్నారు.