CP Anjani Kumar: గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనపై సీపీ అంజనీకుమార్ వివరణ
- గాంధీ ఆసుపత్రిలో రేప్ కలకలం
- ఓ మహిళ ఫిర్యాదు
- తీవ్రస్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు
- రేప్ ఓ కట్టుకథ అని తేల్చిన వైనం
గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం జరిగిందంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తడం తెలిసిందే. ఈ అత్యాచార ఘటన అనేక మలుపులు తిరిగింది. దీనిపై సీపీ అంజనీకుమార్ వివరణ ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపామని, గాంధీ ఆసుపత్రిలో ఎలాంటి అత్యాచారం జరగలేదని తేల్చిచెప్పారు. సుమారు 800 గంటల సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించామని, 200 మందిని విచారించామని తెలిపారు.
ఈ కేసులో ఎలాంటి మిస్టరీ లేదని, మహిళపై సామూహిక అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రి నుంచి ఆమె స్వయంగా వెళ్లిపోయిందని, ఫిర్యాదు చేసిన ఆమె సోదరి పోలీసులను తప్పుదోవ పట్టించిందని సీపీ అంజనీకుమార్ వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో లభ్యమైన ఆధారాల సాయంతో ఈ కేసును ఛేదించామని తెలిపారు. ఈ కేసులో టెక్నీషియన్ ఉమామహేశ్వర్ ప్రమేయం లేదని వెల్లడించారు.