AstraZeneca: ఆస్ట్రాజెనెకా టీకా కన్నా వేగంగా తగ్గుతున్న ఫైజర్ ప్రభావశీలత!
- వెల్లడించిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు
- బ్రిటన్‌కు చెందిన నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ స్టడీలో వెల్లడి
- కరోనా సోకిన వారికి మరింత రక్షణ ఇస్తున్న వ్యాక్సిన్లు
- గత డిసెంబరు నుంచి ఆగస్టు వరకూ 3 లక్షల మందిపై పరిశోధన
కరోనా నుంచి రక్షణ కోసం ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న వ్యాక్సిన్లలో ఫైజర్ ఒకటి. అయితే కాలం గడిచే కొద్దీ శరీరంలో ఈ టీకా ప్రభావశీలత వేగంగా తగ్గిపోతున్నట్లు యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ప్రారంభంలో ఫైజర్ టీకా మెరుగైన ప్రభావం చూపుతున్నప్పటికీ, అనంతర కాలంలో ఈ ప్రభావం వేగంగా తగ్గుతున్నట్లు బ్రిటన్‌కు చెందిన నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ పరిశోధనలో తేలింది.
అలాగే, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రభావం ఫైజర్ కన్నా ఎక్కువ కాలం ఉంటుందని కూడా ఈ పరిశోధన తేల్చింది. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకూ ర్యాండమ్‌గా ఎంపిక చేసిన కుటుంబాలపై ఈ పరిశోధన చేశారు. అయితే నాలుగైదు నెలల తర్వాత ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల ప్రభావశీలతలో పెద్దగా తేడా కనిపించలేదని తెలుస్తోంది.
కరోనా కొత్త వేరియంట్లు ప్రపంచంలో విజృంభిస్తున్న తరుణంలో ప్రజలకు ‘బూస్టర్ డోస్’గా మరో టీకా ఇవ్వాలని పలు దేశాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూకేలో తాజా పరిశోధన ప్రచురితమైంది. అలాగే ఇప్పటికే ఒకసారి కరోనా సోకిన వారికి ఈ వ్యాక్సిన్లు మరింత రక్షణ కల్పిస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. 18 సంవత్సరాలు పైబడిన 3 లక్షల మందిపై ఈ అధ్యయనం చేసినట్లు సమాచారం. అలాగే డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.