Corona Virus: ఏపీలో కరోనా వల్ల అనాథలైన పిల్లలు ఎంత మంది ఉన్నారంటే..!
- ఏపీలో కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంఖ్య 6,800
- బాధిత పిల్లలకు పాఠశాలల్లో నమోదు ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వ ఆదేశం
- ప్రైవేట్ స్కూళ్లలో చదివే పిల్లలకు కూడా విద్యాకానుక కిట్ అందజేత
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎందరో చిన్నారులను అనాథలను చేసింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన విషయాన్ని వెల్లడించింది. ఏపీలో కరోనా వల్ల 6,800 మంది పిల్లలు వారి తల్లిదండ్రులను కోల్పోయారని తెలిపింది. వీరిలో 4,033 మంది పిల్లల వివరాలను సేకరించామని చెప్పింది. వీరిలో 1,659 మంది ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో... 2,150 మంది ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్నారని వెల్లడించింది. మిగిలిన వారిని శిశువులుగా గుర్తించినట్టు తెలిపింది.
కరోనా బాధితులుగా మారిన పిల్లలకు ఉచిత విద్యను అందించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించినన నేపథ్యంలో అనాథలైన పిల్లల వివరాలను సేకరించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. వీరందరికీ వెంటనే పాఠశాలల్లో నమోదు ప్రక్రియను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలకు కూడా విద్యాకానుక కిట్ ను అందించాలని చెప్పింది.