Afghanistan: వెళ్లిపోవద్దంటూ భారత్​ కు తాలిబన్ల విజ్ఞప్తి.. పట్టించుకోని భారత్​!

Talibans Assured Indians Security Requested Not to Leave From the Country
  • హాని తలపెట్టబోమంటూ తాలిబన్ల హామీ
  • దాడులు చేయబోమంటూ వెల్లడి
  • వారితో ఎప్పటికైనా ముప్పేనన్న భారత్
  • ఎంబసీ, కాన్సులేట్ అధికారులందరి తరలింపు
తాలిబన్ల ఆక్రమణలతో అన్ని దేశాలు తమతమ రాయబారులు, దౌత్యవేత్తలను ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలించేశాయి. భారత్ కూడా కాబూల్ లోని ఎంబసీ సహా.. వివిధ నగరాల్లో ఉన్న కాన్సులేట్లలోని దౌత్యవేత్తలను వెనక్కు తీసుకొచ్చింది. అయితే, కాబూల్ రాయబార కార్యాలయం నుంచి మన అధికారులను తీసుకెళ్లొద్దంటూ భారత్ కు తాలిబన్లు విజ్ఞప్తి చేశారు. ఏమీ చేయబోమంటూ హామీ ఇచ్చారు.

తాలిబన్ రాజకీయ విభాగం అధిపతి అయిన అబ్బాస్ స్టానిక్జాయ్.. భారత ప్రభుత్వానికి ఈ సందేశాన్ని చేరవేశారని అధికారులు చెబుతున్నారు. ‘‘కాబూల్ రాయబార కార్యాలయంలోని ఏ ఒక్క అధికారికీ హాని తలపెట్టబోం. లష్కరే తాయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల మాదిరి ఎంబసీపై దాడులు చేయం’’ అని హామీ ఇచ్చిందట.

అయితే, ఆ ఉగ్రవాద సంస్థ వల్ల భవిష్యత్ లో కలిగే ముప్పును దృష్టిలో పెట్టుకుని వారి విజ్ఞప్తిని భారత్ తిరస్కరించిందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులను కాబూల్ ఎయిర్ పోర్టుకు తరలిస్తుండగా.. కొందరు తాలిబన్లు అడ్డుకుని వారి వ్యక్తిగత సామగ్రిని లాగేసుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం నాటికి ఆ దేశంలోని రాయబారి రుద్రేంద్ర టాండన్ సహా అందరినీ ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆర్మీ సీ17 విమానంలో భారత్ తీసుకొచ్చేసింది.
Afghanistan
Taliban
India
Kabul
Embassy
Evacuation

More Telugu News