Mekathoti Sucharitha: మూడున్నర లక్షల మంది దిశ యాప్ ను ఉపయోగించారు: సుచరిత
- రమ్య కుటుంబానికి ఇంటి స్థలం పట్టా అందజేశాం
- రూ. 10 లక్షల చెక్కును అందించాం
- కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అందిస్తాం
గుంటూరులో ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని రాష్ట్ర హోంమంత్రి సుచరిత పరామర్శించారు. ఇంటి స్థలం పత్రాలను వారికి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రమ్య హత్య కలచి వేస్తోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రావాల్సినవన్నీ రమ్య కుటుంబానికి అందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన రూ. 10 లక్షల చెక్కును అందించామని చెప్పారు. వీరి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ఇంటి స్థలానికి సంబంధించిన పట్టాను పంపిణీ చేశామని చెప్పారు. రమ్య హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు.
సోషల్ మీడియా పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కాలేజీల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. దిశ యాప్ ను ఇప్పటి వరకు 40 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని... మూడున్నర లక్షల మంది ఉపయోగించారని చెప్పారు. మహిళలకు ఇబ్బంది ఏర్పడితే దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.