Osama Bin Laden: జో బైడెన్ ను ఎట్టి పరిస్థితుల్లో చంపరాదని నాడు అల్ ఖైదాను ఆజ్ఞాపించిన లాడెన్!
- ఆఫ్ఘన్ సంక్షోభం నేపథ్యంలో బైడెన్ పై విమర్శలు
- 2010లో లేఖ రాసిన లాడెన్
- బైడెన్ అధ్యక్ష పదవికి సన్నద్ధంగా లేడని వ్యాఖ్యలు
- అమెరికా సంక్షోభంలో చిక్కుకుంటుందని వెల్లడి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనూహ్యరీతిలో ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభానికి కేంద్రబిందువుగా మారడం తెలిసిందే. ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాలను వెనక్కి పిలిపించాలన్న బైడెన్ నిర్ణయం తాలిబన్లకు వరంలా మారిందని, ఈ క్రమంలోనే వారు రెట్టించిన ఉత్సాహంతో ఆఫ్ఘన్ ను ఆక్రమించేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఆఫ్ఘన్ సంక్షోభానికి బైడెనే కారణమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేలెత్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఓ ఆసక్తికర అంశం వెల్లడైంది.
అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ 2010లో రాసిన ఓ లేఖలో సంచలన విషయాలు తెరపైకి వచ్చాయి. బరాక్ ఒబామాను హతమార్చితే, జో బైడెన్ అధ్యక్షుడయ్యే అవకాశాలు ఉన్నాయని లాడెన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పటికి అధ్యక్ష పదవికి సన్నద్ధం కాని బైడెన్ వంటి వ్యక్తి అధ్యక్షుడైతే అమెరికా తనంతట తానే సంక్షోభంలో కూరుకుపోతుందని లాడెన్ వివరించాడు.
ఈ మేరకు 48 పేజీల భారీ లేఖను తన అనుచరుడు షేక్ మహ్మద్ కు రాశాడు. లాడెన్ తన సోదరుడిగా భావించే షేక్ మహ్మద్ అసలు పేరు అతియా అబ్ద్ అల్ రహమాన్. కాగా, ఒబామా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో పర్యటించేందుకు వస్తే హతమార్చేందుకు రెండు దళాలను కూడా ఏర్పాటు చేసినట్టు లాడెన్ ఆ లేఖలో పేర్కొన్నారు. లాడెన్ హతుడైన అబ్బొట్టాబాద్ ఇంటిలో ఈ లేఖ దొరికింది.