Shoib Akhtar: మళ్లీ భారత్ లో అడుగుపెట్టాలని కోరుకుంటున్నా: షోయబ్ అఖ్తర్
- ఇండియాలో నాకు ఎన్నో మధురస్మృతులు ఉన్నాయి
- సల్మాన్, షారుఖ్ నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు
- ఐదేళ్లుగా భారత్ కు రాలేకపోయాను
మిస్సైళ్ల వంటి తన వేగవంతమైన బంతులతో ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్లను వణికించిన ఘనత పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ది. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అఖ్తర్ కామెంటేటర్ గా మారిపోయాడు. ఇండియాలోని కొన్ని టీవీ రియాల్టీ షోలలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఎక్కువ రోజులు ఇండియాలోనే గడిపేశాడు. బాలీవుడ్ తో కూడా అఖ్తర్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇండియాలో ఎక్కువ కాలం ఉండటంతో ఈ గడ్డపై ఆయనకు అనుబంధం పెరిగింది. ఈ విషయాన్ని అఖ్తర్ స్వయంగా చెప్పాడు.
ఇండియాలో తనకు ఎన్నో మధురస్మృతులు ఉన్నాయని తెలిపాడు. ఇండియాలో ఆధార్ కార్డు, రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని ఒకప్పుడు తనను అడిగేవారని... అంతగా తాను అక్కడ పని చేశానని అఖ్తర్ చెప్పాడు. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తనను సొంత తమ్ముడిలా చూసుకున్నారని తెలిపాడు.
అయితే, దురదృష్టవశాత్తు ఐదేళ్లుగా భారత్ కు రాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. మళ్లీ భారత్ లో అడుగుపెట్టాలని కోరుకుంటున్నానని చెప్పాడు. కొన్ని నెలల్లో భారత్, పాకిస్థాన్ ల మధ్య సంబంధాలు మెరుగవ్వాలని ఆశిస్తున్నానని... అది జరగ్గానే భారత్ లో వాలిపోయే తొలి పాకిస్థానీని తానే అవుతానని చెప్పాడు. అంతేకాదు, భారత్ కు వస్తే తాను పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకుంటానని నవ్వుతూ అన్నాడు.