Afghanistan: తాలిబన్ల కళ్లుగప్పి.. ఓ కుటుంబాన్ని సురక్షితంగా తరలించిన అమెరికా

usa save afghan police family

  • గ‌తంలో అమెరికాకు సాయం చేసిన పోలీస్ ఆఫీసర్ ఖాలిద్
  • ఆయ‌న కోసం తాలిబ‌న్ల గాలింపు
  • ‘ఆపరేషన్‌ ప్రామిస్‌ కెప్ట్‌’ పేరుతో ఖాలిద్‌ను కాపాడిన అమెరికా  
  • సుర‌క్షిత ప్రాంతానికి ఖాలిద్ కుటుంబం త‌ర‌లింపు

ఆఫ్ఘ‌న్ నుంచి త‌మ‌ పౌరుల‌నే కాకుండా ఆ దేశంలో త‌మ‌కు స‌హ‌క‌రించిన వారిని కూడా అమెరికా విమానాల్లో త‌ర‌లిస్తోన్న విష‌యం తెలిసిందే. ఆఫ్ఘ‌న్‌లో త‌మ‌కు స‌హ‌క‌రించిన వారిని తాలిబ‌న్ల బారి నుంచి ర‌క్షించ‌డానికి అమెరికా సైన్యం అప‌రేష‌న్లు నిర్వ‌హిస్తోంది.

తాజాగా, ఆఫ్ఘ‌న్‌కు చెందిన ఓ పోలీస్‌ ఉన్నతాధికారిని తాలిబన్ల కళ్లుగప్పి అమెరికాకు తీసుకెళ్లింది. ‘ఆపరేషన్‌ ప్రామిస్‌ కెప్ట్‌’ పేరుతో తాజాగా చేప‌ట్టిన ఈ ఆప‌రేష‌న్‌లో భాగంగా మహమ్మద్‌ ఖాలిద్‌ వర్దక్ అనే అధికారితో పాటు ఆయ‌న కుటుంబాన్ని ర‌క్షించాల‌ని సైన్యం ప్ర‌ణాళిక వేసుకుంది. చివ‌ర‌కు ఆయ‌న కుటుంబాన్ని ర‌క్షించింది.

ఆఫ్ఘ‌న్‌లో అమెరికా సైనికులతో కలిసి ఇన్నాళ్లు ప‌నిచేసిన ఆయ‌నపై గ‌తంలో ఉగ్ర‌వాదులు దాడి చేయ‌డంతో ఆయ‌న‌ కాలు పోయింది. అనంత‌రం అమెరికా సాయంతో ఆయ‌న‌ కృత్రిమ కాలు అమర్చుకున్నాడు. తర్వాత మళ్లీ విధుల్లో చేరి అమెరికాకు స‌హ‌క‌రిస్తూ ఆఫ్ఘ‌న్‌ పోలీసు దళంలో ప‌నిచేశారు. ఆఫ్ఘ‌నిస్థాన్‌ తాలిబన్ల వ‌శం కావ‌డంతో ఆయ‌న కోసం ఉగ్ర‌వాదులు ఇంటింటా గాలించారు. ఆయ‌న క‌న‌ప‌డితే కాల్చి వేసేందుకు ప్ర‌య‌త్నించారు.

ఈ క్రమంలో త‌న‌ కుటుంబాన్ని రక్షించుకునేందుకు మహమ్మద్‌ ఖాలిద్‌ వర్దక్ పలుసార్లు త‌న‌ స్థావరం మార్చుకున్నారు. అమెరికా సైన్యంలోని కొంద‌రు ఆయ‌న‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చి, కుటుంబంతో పాటు తాము చెప్పిన ప్రదేశానికి వస్తే అమెరికాకు త‌ర‌లిస్తామ‌ని తెలిపారు. తాలిబన్ల కంట ప‌డ‌కుండా ఆయ‌న అనేక క‌ష్టాలు ఎదుర్కొని చివ‌ర‌కు అమెరికా సైన్యం వ‌ద్ద‌కు చేరారు. దీంతో అమెరికా సైన్యం ఆయనతో పాటు ఆయ‌న‌ భార్య, నలుగురు పిల్లలను హెలికాఫ్టర్లో సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది.

  • Loading...

More Telugu News