Neeraj Chopra: నీరజ్ చోప్రాకు ఆర్మీ గిఫ్ట్.. పూణేలోని స్టేడియానికి గోల్డ్ మెడలిస్ట్ పేరు
- 2006లో నిర్మించిన ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ (ఏఎస్ఐ)
- కెరీర్ ప్రారంభంలో నీరజ్ శిక్షణ ఇక్కడే
- ముఖ్యఅతిథిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారతదేశం వందేళ్ల కలను సాకారం చేసిన నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. పూణేలో ఉన్న సౌతర్న్ కమాండ్‌కు చెందిన ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్(ఏఎస్ఐ)కి నీరజ్ పేరు పెట్టాలని ఆర్మీ నిర్ణయించింది. ఈ వేడుక ఆగస్టు 23న జరగనుంది. నీరజ్ సాధించిన చారిత్రాత్మక విజయానికి గుర్తుగా, అలాగే భావి క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నామకరణ వేడుకకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఆయనతోపాటు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవాణే, సౌతర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ నయన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. ఈ సందర్భంగా స్టేడియానికి ‘నీరజ్ చోప్రా ఆర్మీ స్పోర్ట్స్ స్టేడియం’ అని పేరు పెట్టబోతున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ స్టేడియంలో చాలామంది క్రీడాకారులు ప్రతిరోజూ శిక్షణ తీసుకుంటారు. అయితే ఈ స్టేడియానికి ఏ ప్రముఖుడి పేరూ లేదని, ఈ కారణంగానే ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా పేరు పెట్టాలని తాము నిర్ణయించినట్లు ఆర్మీ అధికారులు చెబుతున్నారు. స్వర్ణ పతకం గెలిచిన తర్వాత తొలిసారి ఇక్కడకు వస్తున్న నీరజ్‌కు ఇది మంచి గిఫ్ట్ అవుతుందని వారు తెలిపారు. 2006లో నిర్మించిన ఈ స్టేడియంలోనే కెరీర్ ప్రారంభంలో నీరజ్ కూడా శిక్షణ తీసుకోవడం గమనార్హం.