Corona Virus: కరోనా చికిత్స కోసం దేశ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది లోన్లు తీసుకున్నారో తెలుసా?
- కరోనా చికిత్సకు లక్షల రూపాయలు పిండేసిన ప్రైవేటు ఆసుపత్రులు
- రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించిన బాధితులు
- ఎక్కువ లోన్లు తీసుకున్న రాష్ట్రంగా తమిళనాడు
కరోనా చికిత్స కోసం దేశ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది లోన్లు తీసుకున్నారో తెలుసా? కరోనా మహమ్మారి మన దేశంలో కోట్లాది కుటుంబాలను బాధితులుగా మార్చేసింది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది కరోనా నుంచి బయటపడేందుకు ఆసుపత్రులకు లక్షలాది రూపాయలు సమర్పించుకున్నారు. దేశ వ్యాప్తంగా 1.33 లక్షల మంది కరోనా చికిత్స కోసం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నారు. ఈ గణాంకాలను కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఈ జాబితాలో తమిళనాడు తొలి స్థానంలో నిలవగా... ఆ తర్వాతి స్థానాలను కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలు ఆక్రమించాయి. తమిళనాడులో 33,917 మంది రుణాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... తెలంగాణలో 3,389 మంది, ఆంధ్రప్రదేశ్ లో 2,791 మంది లోన్లు తీసుకున్నారు.
ప్రైవేటు బ్యాంకులు లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేయడంతో... చాలా మంది బ్యాంకు లోన్లు తీసుకున్నారు. బ్యాంకులు కూడా అన్ సెక్యూర్డ్ రుణాలు ఇచ్చాయి. దీంతో కరోనా కారణంగా ఉపాధి, ఉద్యోగావకాశాలను కోల్పోయిన ఎంతో మంది ఈ వెసులుబాటును ఉపయోగించుకుని రుణాలు తీసుకున్నారు. అయితే, ప్రైవేటు బ్యాంకులు, ఇతర ప్రైవేటు మార్గాల్లో రుణాలు తీసుకున్నవారి సంఖ్య అదనం.