CPI Ramakrishna: వివేకా హత్యకేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామనడం సిగ్గుచేటు: సీపీఐ రామకృష్ణ
- ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న రామకృష్ణ
- వివేకా హత్య కేసు నేపథ్యంలో వ్యాఖ్యలు
- వెలిగొండ ప్రాజెక్టుపైనా స్పందన
- పనులు పూర్తయినా నీళ్లు రావడంలేదని వెల్లడి
సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద హత్య కేసుపై స్పందించారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన, వివేకా హత్య కేసులో కీలక సమాచారం అందించినవారికి సీబీఐ రూ.5 లక్షలు నజరానా ప్రకటించడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. వివేకాను చంపింది ఎవరో పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీలను అడిగితే చెబుతారని పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా అంశాలపై వ్యాఖ్యానిస్తూ, వెలిగొండ ప్రాజెక్టును కేంద్రం గెజిట్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. పనులు పూర్తయినా నీళ్లు విడుదల చేయని ఏకైక ప్రాజెక్ట్ వెలిగొండ అని తెలిపారు. టిడ్కో ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతోందని విమర్శించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.