Taliban: ఆఫ్ఘన్‌లోని పంజ్‌షీర్ లో పోరు ఉద్ధృతం.. 300 మంది తాలిబన్లను చంపేశామన్న సైన్యం!
- భారీగా పంజ్‌షీర్ వైపునకు వెళుతోన్న తాలిబన్లు
- ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు
- తాలిబన్ల చర్యలను సమర్థంగా తిప్పికొడుతోన్న సైన్యం
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను సైతం స్వాధీనం చేసుకుని ఆ దేశంలో తమకు తిరుగులేదని భావిస్తోన్న తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినప్పటికీ తాలిబన్లు ఇప్పటివరకు పంజ్‌షీర్ లోయను మాత్రం తమ అధీనంలోకి తెచ్చుకోలేకపోయారు. అక్కడి ప్రజలు, సైన్యం ఏ మాత్రం భయపడడం లేదు. తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. పంజ్‌షీర్ కు వెళ్లే మార్గాల్లో ప్రజలు కూడా పహారా కాస్తున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజల ధైర్యం ప్రపంచ దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఈ క్రమంలో ఇప్పుడు తాలిబన్లు పంజ్‌షీర్ వైపునకు పెద్ద ఎత్తున ఆయుధాలతో బయలుదేరారు. దీంతో పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పంజ్‌షీర్ లోయ ఆక్రమణకు తాలిబన్లు ప్రయత్నాలు జరపడంతో వారి చర్యలను సైన్యం, ప్రజలు తిప్పికొట్టారు. దాదాపు 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్‌షీర్ సైన్యం ప్రకటన చేసింది. మరోపక్క, భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ వైపునకు మరికొంతమంది తాలిబన్లు కదులుతున్నారు.