Raghu Rama Krishna Raju: వివేకాకు గుండెపోటు వచ్చిందని విజయసాయికి ఎవరు చెప్పారు?: రఘురామకృష్ణ రాజు
- వివేకా మృతిపై సందేహాలు
- సీబీఐ విజయసాయిని ప్రశ్నించాలని సూచన
- ఎవరు తారుమారు చేశారో తెలియాలన్న రఘురామ
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మరణం చుట్టూ నెలకొన్న సందేహాలపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. వివేకాకు గుండెపోటు వచ్చిందని ఎంపీ విజయసాయిరెడ్డికి ఎవరు చెప్పారు? అంటూ ప్రశ్నించారు. ఈ అంశంలో సీబీఐ ముందుగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని రఘురామ అభిప్రాయపడ్డారు. వివేకా మృతిపై విషయం మార్చి చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉందో తెలియాలని అన్నారు.
అటు, మరో ఆసక్తికర అంశంపైనా రఘురామ స్పందించారు. "ఎన్నికల్లో జగన్, నేను పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఐవీఆర్ఎస్ విధానంలో సర్వే చేయించాను. జగన్ కు, నాకు మధ్య 19 శాతం తేడా ఉంది. జగన్ కంటే నాదే పైచేయి అని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమవుతుందో సర్వేలో వెల్లడైంది. చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, చంద్రబాబులకు 60 శాతం ప్రజలు మద్దతు పలికారు. జిల్లాల వారీగా జయాపజయాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు ఎన్నికలు పెడితే వైసీపీ 50కు మించి సీట్లు గెలవదు.
తప్పుడు ప్రచారం ఆపేందుకే సర్వే వివరాలు చెప్పాను. పార్టీపైనా, కొందరు ఎమ్మెల్యేలపైనా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. గ్రంధి శ్రీనివాస్ కు మాత్రమే 50 శాతం పాజిటివిటీ ఉంది. మా జిల్లాలో మిగిలిన నేతలకు ప్రజా మద్దతు లేదు" అని వివరించారు.
అంతేకాదు, నాసిరకం మద్యంపై కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసినట్టు రఘురామకృష్ణరాజు వెల్లడించారు. అమరరాజా పరిశ్రమలో వాయు కాలుష్యం గురించి మాట్లాడేవాళ్లు మద్యం వల్ల పాడవుతున్న ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. మద్యం వల్ల ఎందరి కాలేయం దెబ్బతిన్నదో వివరాలు సేకరించాలని, అటు అమరరాజా సంస్థ వల్ల ఎందరికి నష్టం జరిగిందో తెలుసుకోవాలని అన్నారు.