Drone: భారత్-పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ సంచారం
- ఈ తెల్లవారుజామున కనిపించిన డ్రోన్
- ఆర్నియా సెక్టార్లో సంచారం
- 25 రౌండ్లు కాల్పులు జరిపిన జవాన్లు
- మరింత ఎత్తుకు చేరి పాక్ వైపు వెళ్లిన డ్రోన్
ఇటీవల భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోనూ, శ్రీనగర్ లోనూ డ్రోన్లు తీవ్ర కలకలం రేపాయి. వాటిలో ఓ డ్రోన్ పేలుడు పదార్థాలు మోసుకురావడం ఆందోళన కలిగించింది. గత రెండేళ్ల కాలంలో సరిహద్దుల్లో 350కి పైగా డ్రోన్లను గుర్తించారు. అయితే, వీటి పట్ల భారత భద్రతా బలగాలు అప్రమత్తంగానే ఉన్నాయి.
తాజాగా ఈ తెల్లవారుజామున జమ్మూలోని ఆర్నియా సెక్టార్ లో ఓ డ్రోన్ కనిపించింది. ఆకాశంలో మెరుస్తూ వస్తున్న డ్రోన్ ను భారత సరిహద్దు భద్రతా దళం గుర్తించింది. వెంటనే పాతిక రౌండ్లు కాల్పులు జరపడంతో ఆ డ్రోన్ నిష్క్రమించింది. తుపాకుల రేంజికి అందకుండా మరింత ఎత్తుకు చేరిన ఆ డ్రోన్, పాక్ భూభాగం వైపు వెళ్లిపోయింది. ఆపై బీఎస్ఎఫ్ జవాన్లు స్థానిక పోలీసులతో కలిసి ఆర్నియా సెక్టార్లో గాలింపు చేపట్టగా, ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదు.