Maruti Suzuki: వినియోగదారులకు డిస్కౌంట్ల విషయంలో... మారుతి సుజుకి కార్ల కంపెనీకి 200 కోట్ల జరిమానా!
- డిస్కౌంట్లపై పరిమితులు విధిస్తోందంటూ ఆరోపణ
- 2019లోనే ప్రారంభమైన దర్యాప్తు
- ఈ-మెయిల్స్ కూడా బయటపెట్టిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా
భారతదేశంలోని అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకికి భారీ జరిమానా పడింది. కార్ల డీలర్లు ఇచ్చే డిస్కౌంట్లపై ఈ కంపెనీ పరిమితులు విధిస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2019 నుంచి ఈ కంపెనీపై దర్యాప్తు జరుగుతోంది. తాజాగా ఈ దర్యాప్తును ముగించిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ).. మారుతి సుజుకి కంపెనీపై 27 మిలియన్ డాలర్లు అంటే మన లెక్కల్లో రూ.200 కోట్ల జరిమానా విధించాలని నిర్ణయించింది.
వినియోగదారులకు కార్ల డీలర్లు ఇచ్చే డిస్కౌంట్లపై పరిమితులు విధించాలని మారుతి సుజుకి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ ఒత్తిడి లేకపోతే వినియోగదారులకు మరింత మేలు కలుగుతుందని సీసీఐ పేర్కొంది. అయితే గతంలో ఈ విషయంపై మాట్లాడిన మారుతి సుజుకి.. తాము ఇలా ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని పేర్కొంది.
అయితే మారుతి సుజుకి అధికారులకు, కార్ల డీలర్లకు మధ్య జరిగిన ఈ-మెయిల్ సంభాషణలను సీసీఐ బయటపెట్టినట్లు తెలుస్తోంది. వీటిలో డిస్కౌంట్లపై కార్ల కంపెనీ పరిమితులు విధించినట్లు స్పష్టమైందట. మారుతి సుజుకి కంపెనీలో అధికభాగం షేర్లు జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సీసీఐ విధించిన ఫైన్‌పై ఈ కంపెనీ స్పందించలేదు. తాము విధించిన జరిమానా సొమ్మును 60 రోజుల్లోగా కట్టేయాలని సీసీఐ ఆదేశించింది.