Corona Virus: ఒక్క యాంటీబాడీతో కరోనాలోని అన్ని వేరియంట్లకు చెక్!
- గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు
- ఎలుకల్లో జరిపిన ప్రయోగంలో 43 రకాల ఆర్‌బీడీల గుర్తింపు
- అన్ని వేరియంట్లకు చెక్ పెడుతున్న ‘సార్స్2-38’ యాంటీబాడీ
కరోనా వైరస్ రోజుకో రూపుతో ప్రజలను భయపెడుతుండడంతో దాని పని పట్టడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని వేరియంట్ల నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీని అమెరికాలోని వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‌లోని కీలకమైన ‘రిసెప్టార్ బైండింగ్ డొమైన్’ (ఆర్బీడీ)ని ఎలుకల్లోకి చొప్పించారు.
అనంతరం వాటి యాంటీబాడీలను పరిశీలించారు. వాటిలో 43 రకాల ఆర్బీడీలను గుర్తించారు. వీటిని కరోనాలోని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, కప్పా, అయోటా సహా పలు వేరియంట్లపై పరీక్షించి పరిశీలించారు. అందులో సార్స్2-38 అనే యాంటీబాడీ కరోనాలోని అన్ని వేరియంట్లకు చెక్ పెడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.