Earthquake: బంగాళాఖాతంలో భూకంపం... చెన్నైలో ప్రకంపనలు
- ఈ మధ్యాహ్నం సముద్రంలో భూకంపం
- రిక్టర్ స్కేల్ పై 5.1 తీవ్రత నమోదు
- చెన్నైలో పరుగులు తీసిన ప్రజలు
- సునామీ వచ్చే అవకాశం లేదన్న నిపుణులు
బంగాళాఖాతంలో నేడు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఈ క్రమంలో తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు-ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపానికి సంబంధించిన వివరాలను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సీస్మాలజీ వెల్లడించింది.
ఈ మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూమి కంపించిందని వివరించింది. ఏపీలోని కాకినాడకు దక్షిణ-ఆగ్నేయ దిశలో 296 కిలోమీటర్లు, రాజమండ్రికి దక్షిణ-ఆగ్నేయంగా 312 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపకేంద్రం ఉన్నట్టు తెలిపింది.
దీని ప్రభావంతో చెన్నైలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటికి పరుగులు తీశారు. కాగా, ఈ భూకంప ప్రభావం నేపథ్యంలో ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. అటు, ఏపీలోనూ పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంస్థ వెల్లడించింది.