Botsa Satyanarayana: టిడ్కో ఇళ్లు, పథకాలపై లోకేశ్ కు అవగాహన లేదు: బొత్స సత్యనారాయణ
- బీసీల స్థితిగతులను మార్చేందుకు ప్రణాళిక ప్రకారం పని చేస్తున్నాం
- మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం
- టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీలపై సీఎం సమీక్ష నిర్వహించారు
టీడీపీ నేత నారా లోకేశ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. బీసీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, టిడ్కో ఇళ్ల గురించి లోకేశ్ కు అవగాహన లేదని చెప్పారు. వారి ప్రభుత్వంలో ఏం చేశారు? ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏమేం ఇస్తోందనే విషయాలను పోల్చుతూ మాట్లాడితే బాగుంటుందని అన్నారు. బీసీల స్థితిగతులను మార్చేందుకు ఒక ప్రణాళిక ప్రకారం పని చేస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బొత్స మరోసారి స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని చెప్పారు. అమరావతి పిటిషన్లపై రోజువారీ విచారణ అన్నప్పుడు పిటిషనర్లే వాయిదా అడగాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్ల కేటాయింపులు, జగనన్న కాలనీల నిర్మాణాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారని, పనులను వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు.