Narayan Rane: భోజనం చేస్తున్న రాణేను అరెస్ట్ చేశారంటూ వీడియో విడుదల చేసిన బీజేపీ
- సీఎం చెంప పగలగొట్టేవాడిని అన్న నారాయణ్ రాణే
- స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పొరబడిన ఉద్ధవ్ థాకరే
- స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందని పక్కవాళ్లని అడిగిన సీఎం
- దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాణే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కేంద్ర మంత్రి నారాయణ రాణే అరెస్టయ్యారు. ఇలా అరెస్టయిన సమయంలో రాణే భోజనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ విడుదల చేసింది. ఈ వీడియోలో 69 ఏళ్ల రాణే చేతిలో భోజనం ప్లేటు పట్టుకొని ఉన్నారు. ఆయన కుమారుడు నితీష్ రాణే పోలీసులను అడ్డుకుంటున్నట్లు కనిపిస్తోంది.
‘‘సర్ తింటున్నారు. ఒక్క నిమిషం.. ఒక్క నిమిషం.. నన్ను టచ్ చేయకండి’’ అంటూ అతను అంటున్నట్లు వినిపిస్తోంది. రాణేను భోజనం మధ్యలోనే అరెస్టు చేసిన పోలీసులు.. ముంబైకి 300 కిలోమీటర్ల దూరంలోని సంగమేశ్వర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
రాణేపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అల్లర్లు చేసినట్లు కూడా కేసు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, భారత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందనే విషయం థాకరే మర్చిపోయారు. రాయ్‌గడ్‌లో జరిగిన జన్ ఆశీర్వాద్ యాత్రలో దీనిపై ఘాటుగా స్పందించిన రాణే.. ‘‘దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో ఒక ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కనుక్కోవడానికి ఆయన వెనక్కు తిరిగి పక్కవాళ్లను అడిగారు. నేను అక్కడ ఉండి ఉంటే.. ఆయన(ఉద్ధవ్ థాకరే) చెంప పగలగొట్టేవాడిని’’ అని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే రాణేను అరెస్టు చేశారు. తన అరెస్టు విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చూపెట్టాలని, తాను ఎటువంటి నేరం చేయకుండానే అరెస్టవుతున్నానని రాణే అన్నారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తే మీడియాపై కేసులు పెడతానని హెచ్చరించారు. ఒక కేంద్ర మంత్రిని ఇలా అరెస్టు చేయడాన్ని రాజ్యాంగ వ్యతిరేక చర్యగా బీజేపీ అభివర్ణించింది. తాము ఇలాంటి అరెస్టులకు భయపడబోమని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టంచేశారు. గడిచిన 20 ఏళ్లలో ఒక కేంద్రమంత్రిని పోలీసులు అరెస్టు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.