Telangana: 11 ఏళ్ల క్రితం చనిపోయిందనుకున్న తెలంగాణ మహిళ తమిళనాడులో ప్రత్యక్షం
- 11 ఏళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయిన మహిళ
- ఆ తర్వాత రెండేళ్లకు అంత్యక్రియలు
- మతిస్థిమితం కోల్పోయి తమిళనాడు చేరుకున్న మహిళ
- చేరదీసి చికిత్స అందించిన స్వచ్ఛంద సంస్థ
దశాబ్ద కాలం క్రితం చనిపోయిందని భావించిన మహిళ తాజాగా కనిపించడంతో బాధిత కుటుంబ సభ్యులు ముందు షాక్‌కు గురై.. ఆ తర్వాత ఆనందంలో మునిగితేలారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌కు చెందిన నర్సయ్య-లక్ష్మి (48) దంపతులకు ముగ్గురు కుమార్తెలు. నర్సయ్య గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 11 ఏళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయిన లక్ష్మి ఉన్నట్టుండి ఇంటినుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఎంతగా వెతికినా ఫలితం లేకపోయింది.
ఆ తర్వాత రెండేళ్లకు కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్ అటవీ ప్రాంతంలో ఓ మహిళ శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దుస్తులను బట్టి ఆమె లక్ష్మియేనని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తిచేసేశారు. మరోవైపు, మతిస్థిమితం కోల్పోయిన లక్ష్మి ఇంటి నుంచి బయలుదేరి తిరుగుతూ తిరుగుతూ తమిళనాడులోని పెరంబలూరు చేరుకుంది. అక్కడ ఆమెను ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి చికిత్స చేయించింది.
కొన్నాళ్లకు చికిత్సతో కోలుకున్న లక్ష్మి నుంచి వివరాలు సేకరించిన స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో తమిళనాడు చేరుకున్న కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి లక్ష్మిని ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయిందనుకున్న లక్ష్మి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.