WHO: భారత్ లో మామూలు జబ్బులా కరోనా: డబ్ల్యూహెచ్ వో చీఫ్ సైంటిస్ట్
- కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు
- భిన్న సంస్కృతులు, రోగనిరోధక శక్తే కారణం
- 2022 చివరి నాటికి అందరికీ వ్యాక్సిన్
- ప్రపంచంలో 70% మందికి టీకా అందితే మళ్లీ మామూలు పరిస్థితులు
భారత్ లో కరోనా ఓ మామూలు జబ్బులా (ఎండెమిక్) మారిపోతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ తెలిపారు. త్వరలోనే కొవాగ్జిన్ పనితీరుపై డబ్ల్యూహెచ్ వో టెక్నికల్ గ్రూప్ సంతృప్తి వ్యక్తం చేస్తుందని, వచ్చే నెల మధ్య నాటికి వ్యాక్సిన్ కు అనుమతులను ఇచ్చే అవకాశముందని ఆమె చెప్పారు.
దేశ ప్రజల భిన్న సంస్కృతుల ప్రజలు, వారి రోగనిరోధక శక్తిని దృష్టిలో పెట్టుకుంటే.. దేశంలో మున్ముందు కరోనా పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే కొన్ని చోట్ల మహమ్మారి ఎండెమిక్ గా మారిన సందర్భాలున్నాయన్నారు. కొన్ని నెలల క్రితం కేసులు భారీగా నమోదయ్యాయని, కానీ, ఇప్పుడు హెచ్చతగ్గులు నమోదవుతున్నాయని గుర్తు చేశారు.
ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడిన వారు, వ్యాక్సినేషన్ ఎక్కువగా జరగని ప్రాంతాల్లోని వారిపై రాబోయే రోజుల్లో ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరముంటుందని చెప్పారు. 2022 చివరి నాటికి మన దేశంలో అందరికీ వ్యాక్సిన్లు అందే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచం మొత్తం మీద 70 శాతం మందికి వ్యాక్సిన్ అందితే జీవితాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయన్నారు.
థర్డ్ వేవ్ పై తల్లిదండ్రులకు ఆందోళన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. ఒకవేళ పిల్లలకు కరోనా సోకినా తీవ్రత తక్కువగానే ఉంటుందని ఇటీవలి సీరో సర్వేలు, విదేశాల్లోని పరిస్థితులను చూస్తే అర్థమవుతోందన్నారు. పిల్లల్లో కరోనా మరణాల రేటు చాలా తక్కువన్నారు. అయినా కూడా పిల్లలకు మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించారు. థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుందన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదని చెప్పారు.