results: తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల.. ఇంజినీరింగ్ తొలి 10 ర్యాంకుల్లో 6 ఏపీ విద్యార్థులకే!
- పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థి కార్తికేయకు తొలి ర్యాంకు
- కడప జిల్లాకు చెందిన నరేశ్‌కు రెండో ర్యాంకు
- eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో ఫలితాలు
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఈ రోజు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకుల్లో ఏపీకి చెందిన విద్యార్థులకే 6 ర్యాంకులు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కార్తికేయకు తొలి ర్యాంకు వచ్చింది. అలాగే, కడప జిల్లాకు చెందిన నరేశ్ రెండో ర్యాంకు దక్కించుకున్నాడు.
ఇక హైదరాబాద్ కు చెందిన మహ్మద్ అబ్దుల్‌కి మూడో ర్యాంకు, నల్గొండకు చెందిన రామస్వామికి నాలుగో ర్యాంకు, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఆదిత్యకు ఐదో ర్యాంకు వచ్చాయి. కరోనా సమయంలోనూ పరీక్షలను అధికారులు సమర్థంగా పూర్తి చేశారని, వారికి అభినందనలు తెలుపుతున్నానని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
విద్యార్థులు ఫలితాలను eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను, 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మా ఎంసెట్ ప్రవేశాల పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 30న ప్రారంభం కానుంది.