Salman Khan: నిబంధనలు పాటించాల్సిందేనంటూ సల్మాన్ ఖాన్‌ను అడ్డుకున్న జవానుకి రివార్డు!
- ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టుకి సల్మాన్
- నేరుగా లోపలికి వెళ్లడానికి యత్నం
- లైన్ లో నిలబడమని అడిగిన జవాను
- జవానును అధికారులు మందలించారని కథనాలు
- మందలించలేదని చెప్పిన అధికారులు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో లైనులో రాకుండా నేరుగా లోపలికి వెళ్లబోయాడు. అయితే, సల్మాన్ ఖాన్ పెద్ద సెలబ్రిటీ అని చూడకుండా, ఆయనను లైనులో నిలబడమని, అందరిలానే సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకోవాలనీ చెబుతూ, అక్కడి సీఐఎస్ఎఫ్ జవాను తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆయనను అడ్డుకున్నాడు.
దీంతో సల్మాన్ ఖాన్ లైనులో నిలబడి పత్రాలు చూపించి లోపలికి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల బాగా వైరల్ అయింది. విమానాశ్రయంలోకి వచ్చేవారు ఎవరైనా సరే నిబంధనలు పాటించనిదే లోపలికి వెళ్లనివ్వని ఆ జవానుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
టైగర్-3 సినిమా షూటింగ్ కోసం రష్యా వెళ్లేందుకు సల్మాన్ ముంబై విమానాశ్రయానికి రాగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారు దిగి నేరుగా టర్మినల్‌లోకి వెళ్లాలనుకున్న సల్మాన్ ఖాన్ కు జవాను అడ్డుచెప్పిన తీరు నెటిజన్లను ఆకర్షిస్తోంది.
అయితే, ఈ ఘటన అనంతరం సల్మాన్‌ను అడ్డుకున్న జవాను ఫోన్‌ను అధికారులు సీజ్ చేసినట్లు కథనాలు వచ్చాయి. దీనిపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్ స్పష్టత ఇచ్చింది. అవన్నీ వదంతులేనని చెప్పింది. సీఐఎస్ఎఫ్ ఆఫీసర్‌ను తాము మందలించలేదని తెలిపింది. అంతేగాక, ఆయనకు ఓ రివార్డు ప్రకటించినట్లు సీఐఎస్ఎఫ్ ట్వీట్ చేసింది.