CJI: ఆయనపై ఇంతకుముందే నా అభిప్రాయం చెప్పాను: సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ

I already expressed views on Rakesh Asthana Appointment says CJI
  • ఢిల్లీ కమిషనర్ గా ఆస్థానా నియామకంపై విచారణ
  • సీబీఐ చీఫ్ ఎంపిక ప్రక్రియలో భాగస్వామినన్న సీజేఐ
  • ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారని కామెంట్
  • రెండు వారాల్లో తేల్చాలని హైకోర్టుకు ఆదేశం
ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా రాకేశ్ ఆస్థానా నియామకంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్థానా నియామకాన్ని సవాల్ చేస్తూ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (సీపీఐఎల్) దాఖలు చేసిన పిటిషన్ ను సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ, జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ల ధర్మాసనం ఇవాళ విచారించింది.

ఇప్పటికే ఆస్థానా నియామకానికి సంబంధించిన కేసు ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున.. 2 వారాల్లోగా పిటిషన్ సంగతి తేల్చాలని ఢిల్లీ హైకోర్టును జస్టిస్ రమణ ఆదేశించారు. ఈ కేసు విషయంలో తనకు రెండు సమస్యలున్నాయన్నారు. ‘‘ఒకటి.. రాకేశ్ ఆస్థానా నియామకానికి సంబంధించి నా భాగస్వామ్యం. సీబీఐ చీఫ్ ఎంపిక ప్రక్రియలో ఆయనపై ఇప్పటికే నేను అభిప్రాయాలను చెప్పాను. రెండోది.. మంచో..చెడో.. ఢిల్లీ హైకోర్టులో ఇంతకుముందే దీనిపై పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో సమయం చాలా ముఖ్యమైనది. కాబట్టి.. రెండు వారాల్లోగా ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా ఢిల్లీ హైకోర్టును ఆదేశిస్తున్నాం’’ అని జస్టిస్ రమణ స్పష్టం చేశారు.

అయితే, ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసింది ఆంబుష్ పిటిషన్ అని, ఎలాంటి చెడు ఉద్దేశాలు లేని పిటిషన్లను కొట్టేయించేందుకు ఇలాంటి పిటిషన్లను దాఖలు చేస్తున్నారని సీపీఐఎల్ తరఫున వాదనలు వినిపించిన లాయర్ ప్రశాంత్ భూషణ్ అన్నారు. దీంతో హైకోర్టులో నడుస్తున్న విచారణలో భాగం అయ్యేందుకు పిటిషనర్ కు అధికారమిస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టుకు 4 వారాల గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తి చేసినా.. సుప్రీంకోర్టు అందుకు తిరస్కరించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
CJI
NV Ramana
Supreme Court
Rakesh Asthana
New Delhi
Police Commissioner

More Telugu News