Bandla Ganesh: చిరంజీవి వల్లే నేను బతికున్నా.. ఆయన నాకు ప్రాణం పోశారు: బండ్ల గణేశ్
- కరోనాతో బాధ పడినప్పుడు హాస్పిటల్ లో బెడ్ ఇప్పించారు
- ఆసుపత్రిలో చేరడం ఒక్కరోజు లేటైనా ప్రాణం పోయేదని డాక్టర్లు చెప్పారు
- ఆయన రుణం తీర్చుకోలేనిది
కొన్ని నెలల క్రితం తనకు రెండోసారి కరోనా సోకిందని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తెలిపారు. ఆ సమయంలో తన భార్య, బిడ్డతో పాటు ఇంటిల్లిపాదీ కరోనాతో బాధపడ్డామని చెప్పారు. తన ఊపిరితిత్తులు 60 శాతానికి పైగా ఇన్ఫెక్షన్ కు గురయ్యాయని తెలిపారు.
ఆసుపత్రిలో చేరుదామంటే ఏ ఆసుపత్రిలో కూడా బెడ్లు లేవని... అపోలో ఆసుపత్రికి ఫోన్ చేసినా సారీ అని చెప్పారని అన్నారు. పవన్ కల్యాణ్ కు ఫోన్ చేద్దామంటే అప్పటికే ఆయన కరోనాతో బాధపడుతున్నారని చెప్పారు. ఏం చేయాలో అర్థం కాక చివరకు చిరంజీవి గారికి ఫోన్ చేశానని తెలిపారు. ఫోన్ ఒక్క రింగ్ కాగానే చిరంజీవి గారు లిఫ్ట్ చేశారని... 'చెప్పు గణేశ్' అని అన్నారని... తాను తన సమస్యను ఆయనకు వివరించానని చెప్పారు.
చిరంజీవి కాసేపు మాట్లాడలేకపోయారని... ఫోన్ పెట్టేశారని తెలిపారు. అయితే ఆయన తన పని తాను చేశారని... తనకు హాస్పిటల్ లో బెడ్ దొరికిందని... కొన్ని రోజుల పాటు చికిత్స పొంది ఆరోగ్యంగా బయటపడ్డానని చెప్పారు. హాస్పిటల్ లో చేరడం ఒక్క రోజు లేట్ అయినా ప్రాణం పోయేదని తనతో డాక్టర్లు చెప్పారని... ఈరోజు తాను బతికుండటానికి చిరంజీవి గారే కారణమని, తనకు ఆయన ప్రాణం పోశారని తెలిపారు. నలుగురి మధ్య పాదాభివందనం చేయడం తప్ప... ఆయన రుణం తీర్చుకోలేనని చెప్పారు.