Donald Trump: బైడెన్ విధానాలను తప్పుబట్టిన ట్రంప్.. ఆఫ్ఘనిస్థాన్‌ను ఉగ్రవాదులకు అప్పగించారంటూ నిప్పులు
- తనిఖీలు లేకుండా ఎలా తరలిస్తారు?
- ఇప్పటికే వేలాదిమంది ఉగ్రవాదులు విదేశాలకు చేరారు
- అమెరికా పౌరులను తరలించకుండా బలగాలు ఎలా ఉపసంహరిస్తారు?
- బైడెన్‌పై విరుచుకుపడిన ట్రంప్
ఆఫ్ఘనిస్థాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుసరిస్తున్న విధానాలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికా పౌరులను తీసుకురావడానికి ముందే బలగాలను ఎలా ఉపసంహరిస్తారని ప్రశ్నించారు. ఎలాంటి తనిఖీలు లేకుండా ఆఫ్ఘన్ నుంచి పౌరులను విమానాల్లో బయటకు ఎలా తరలిస్తారని నిలదీశారు.
తనిఖీలు లేని విచ్చలవిడి తరలింపు వల్ల ఇప్పటికే వేలమంది ఉగ్రవాదులు విదేశాలకు చేరుకుని ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాదిమంది అమెరికన్ల ప్రాణాలను బైడెన్ ప్రమాదంలోకి నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 26 వేల మందిని ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలించారని, వారిలో 4 వేల మంది మాత్రమే అమెరికన్లు ఉన్నారని తన వద్ద కచ్చితమైన సమాచారం ఉందని ట్రంప్ అన్నారు. తనిఖీలు లేకుండా తరలింపు చేపట్టడం ఘోర వైఫల్యమేనని ట్రంప్ ధ్వజమెత్తారు.