Revanth Reddy: ఓటుకు నోటు కేసు.. సుప్రీంకోర్టులో రేవంత్, సండ్రలకు ఊరట

Relief for Revanth Reddy and Sandra Venkata Veeraiah in Supreme Court
  • హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
  • రేవంత్ దాఖలు చేసిన మరో పిటిషన్ పైనా విచారణ
  • ఈ నెలాఖరులోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం
  • వచ్చే నెల 7కు విచారణ వాయిదా
ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు ఈ నెల 31లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది.

ఓటుకు నోటు కేసు నుంచి తన పేరును తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య, ఈ కేసును విచారించే అధికారం ఏసీబీకి లేదని రేవంత్‌రెడ్డి హైకోర్టులో ఇటీవల వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.  అయితే, ఈ రెండు పిటిషన్లను కోర్టు కొట్టి వేసింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.

అలాగే, సాక్షుల విచారణ పూర్తయ్యే వరకు ట్రయల్ కోర్టులో ఎలాంటి విచారణ చేపట్టవద్దంటూ రేవంత్ దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా నిన్న విచారణకు వచ్చింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హరీన్ రావల్ వాదనలు వినిపించారు.
Revanth Reddy
Sandra Venkata Veeraiah
Note for Vote
Supreme Court

More Telugu News