Afghanistan: కాబూల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి జరిగే ముప్పుంది.. వెళ్లిపోండి: అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా హెచ్చరిక
- విమానాశ్రయం చుట్టుపక్కలకు రావొద్దని సూచన
- దగ్గరపడుతున్న బలగాల ఉపసంహరణ గడువు
- ఇప్పటికే పూర్తిగా తరలించేసిన ఫ్రాన్స్, బెల్జియం
కాబూల్ విమానాశ్రయం వద్ద ఉగ్రవాద దాడి జరిగే ప్రమాదముందని అమెరికా సహా వివిధ దేశాలు హెచ్చరించాయి. ఆ ప్రాంతంలో ఎవరూ ఉండొద్దని తమతమ దేశాల పౌరులకు సూచించాయి. వివిధ దేశాలకు చెందిన విమానాలు తమ వారిని తీసుకుని వెళ్లిపోతున్న నేపథ్యంలో వేలాది మంది ఆఫ్ఘనిస్థానీలు కాబూల్ ఎయిర్ పోర్టుకు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 90 వేల మంది ఆఫ్ఘన్లు, విదేశీయులను ఒక్క అమెరికా విమానాల్లోనే ఇప్పటిదాకా దేశం దాటించారు.
ఈ నేపథ్యంలోనే కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్ దాడులకు తెగబడే అవకాశం ఉందని, ఎవరూ విమానాశ్రయం చుట్టుపక్కలకు రావొద్దని తమ ప్రజలకు ఆయా దేశాలు సూచించాయి. యాబీ గేట్, తూర్పు గేట్, ఉత్తర గేట్ వద్ద ఉన్న అమెరికా ప్రజలంతా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.
ప్రస్తుతం అక్కడ ఉగ్రవాద దాడి ముప్పు అత్యంత ఎక్కువగా ఉందని ఆస్ట్రేలియా విదేశాంగ వ్యవహారాల శాఖ హెచ్చరించింది. కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఆస్ట్రేలియన్లు ఎవరూ రావొద్దని సూచించింది. ఒకవేళ ఎవరైనా ఉండి ఉంటే వెంటనే అక్కడి నుంచి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని, తదుపరి సూచనలు వచ్చే వరకు వేచి చూడాలని తెలిపింది. బ్రిటన్ కూడా ఇలాంటి హెచ్చరికలే చేసింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి సురక్షితంగా బయటపడేందుకు మార్గాలుంటే.. వెంటనే వచ్చేయాలని పేర్కొంది.
కాగా, మరో ఐదు రోజుల్లో అమెరికా సహా నాటో దళాల ఉపసంహరణ పూర్తి కావాల్సి ఉంది. ఆ డెడ్ లైన్ దగ్గరపడుతోంది. ఇప్పటికే బెల్జియం, ఫ్రాన్స్ లు తమ తమ దళాలను పూర్తిగా వెనక్కు తీసుకెళ్లినట్టు ప్రకటించాయి. బలగాల ఉపసంహరణ కోసం కొన్ని రోజుల పాటు తరలింపు చర్యలను తగ్గిస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. తద్వారా అమెరికా మిలటరీ, వందలాది అమెరికా అధికారులు, ఆఫ్ఘన్ భద్రతా బలగాలు, పరికరాలను తరలించేందుకు సమయం దొరుకుతుందని తెలిపింది.