Supreme Court: పోలీసులు అధికార పార్టీలకు కొమ్ము కాయడం ఆందోళనకరం: సుప్రీంకోర్టు
- చత్తీస్ గఢ్ పోలీసు అధికారి కేసులో సుప్రీం వ్యాఖ్యలు
- పోలీసు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి
- నేతల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్య
- అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు ఆరోపణ
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొందరు పోలీసు అధికారుల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొంతమంది పోలీసు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించింది. అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం ఏంచేసేందుకైనా సిద్ధపడుతున్నారని పేర్కొంది. అధికార పార్టీ నేతల రాజకీయ ప్రత్యర్థులను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రజలకు సేవలు అందించాల్సిన పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాయడం కలవరపరిచే అంశం అని వెల్లడించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తుండడం దురదృష్టకరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలాంటి దుస్సంప్రదాయానికి తెరపడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
చత్తీస్ గఢ్ కు చెందిన ఓ పోలీసు అధికారికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పోలీసులు కచ్చితంగా చట్టానికి లోబడి వ్యవహరించాలని స్పష్టం చేసింది.