Tom Cruise: 59 ఏళ్ల వయసులోనూ ఆ వాడి తగ్గలేదు.. తన జీవితంలోనే అత్యంత ప్రమాదకరమైన స్టంట్ చేసిన టామ్ క్రూజ్!
- మిషన్ ఇంపాజిబుల్ 7 కోసం ప్రమాదకర సీన్
- కొండంచు నుంచి బైక్ తో దూకేసిన వైనం
- చిన్నప్పటి నుంచి ఆ సీన్ తన కలన్న హాలీవుడ్ స్టార్
- సీన్ కోసం 500 స్కైడైవ్ లు, 13 వేల బైక్ జంప్ లతో ట్రయల్స్
సినిమాల్లో అడ్వెంచర్లన్నా, ప్రమాదకరమైన షాట్లన్నా వెంటనే గుర్తొచ్చేది హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్. 59 ఏళ్ల ప్రాయంలోనూ అతడిలో ఆ జోష్ ఏ మాత్రం తగ్గలేదు. తన అడ్వెంచర్ల దాహం తీరలేదు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమాలోనూ ఓ అత్యంత ప్రమాదకరమైన షాట్ ను అతడు అలవోకగా చేసేశాడు. ఇప్పటిదాకా సినిమాల్లో చేసిన ప్రమాదకర స్టంట్లలో ఇదే చాలా చాలా ప్రమాదకరమైనదట.
అమెరికాలోని లాస్ వేగాస్ లో నిర్వహించిన సినిమాకాన్ ట్రేడ్ షోలో భాగంగా ఆ సినిమాను నిర్మించిన పారామౌంట్ సంస్థ ఆ రిస్కీ షాట్ వీడియోను ప్లే చేసింది. వర్చువల్ గా సీన్ ను టామ్ క్రూజ్ ప్రారంభించారు. తన జీవితంలో అత్యంత ప్రమాదకరమైన స్టంట్ ఇదేనంటూ అతడు చెప్పుకొచ్చాడు. దీని కోసం ఎన్నో ఏళ్ల నుంచి శ్రమిస్తున్నామన్నాడు. సీన్ ను నార్వేలో తీశామని, ఓ కొండ అంచు నుంచి బైక్ తో కిందకు జంప్ చేసే సీన్ అని వివరించాడు. చిన్నప్పటి నుంచి ఇలాంటి సీన్ చేయాలన్నది తన కల అని టామ్ తెలిపాడు.
కాగా, ఈ సీన్ కోసం 500 స్కైడైవ్ లు, 13 వేల మోటార్ క్రాస్ జంప్ లను టామ్ చేశాడట. ఒరిజినల్ సీన్ చేసేటప్పుడు సినిమా డైరెక్టర్ క్రిస్టఫర్ మెక్ క్వారీ కాస్తంత ఆందోళనకు గురయ్యాడట. అయితే, సక్సెస్ ఫుల్ గా టామ్ క్రూజ్ తన పారాచూట్ ను ఓపెన్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడట.
దీంతో పాటు టామ్ నటించిన మరో సినిమా ‘టాప్ గన్: మావరిక్’ కూడా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమానూ సినిమాకాన్ లో ప్రదర్శించారు. కొత్తతరం యుద్ధ విమానాలపై సైన్యానికి శిక్షణనిస్తున్న ట్రైలర్ ను అందులో చూపించారు. సినిమాకాన్ కార్యక్రమం ఇవాళ్టితో ముగిసింది. కాగా, అంతకుముందు మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లలోనూ టామ్ రిస్కీ స్టంట్లు చేశాడు. బుర్జ్ ఖలీఫాను అధిరోహించడం.. గాల్లో హెలికాప్టర్ కు వేలాడడం వంటి సీన్లను షూట్ చేశాడు.