Revanth Reddy: మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ ఎందుకు సాహసించడం లేదు?: రేవంత్ రెడ్డి
- మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలు ఇచ్చాను
- 50 ఎకరాల రియలెస్టేట్ వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడ్డారు
- గజదొంగలను పక్కన పెట్టుకుని కేటీఆర్ నీతులు మాట్లాడుతున్నారు
మంత్రి మల్లారెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన అవినీతికి సంబంధించిన ఆధారాలను ఇచ్చానని చెప్పారు. సహచర మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని... ఆరోపణలు వచ్చే వారిని ఉపేక్షించబోనంటూ గతంలో ఇద్దరు మంత్రులపై వేటు కూడా వేశారని అన్నారు.
ఓ రియలెస్టేట్ వ్యాపారిని మల్లారెడ్డి బెదిరించారని... 50 ఎకరాల రియలెస్టేట్ వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకునే వారి నుంచి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ ఎందుకు సాహసించడం లేదని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడిన మల్లారెడ్డిపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేస్తే సేల్ డీడ్ చేయాల్సిందేనని... కానీ, మల్లారెడ్డి బావమరిది 16 ఎకరాలకు యజమాని ఎలా అయ్యారో వివరాలు లేవని రేవంత్ అన్నారు. గిఫ్ట్ డీడ్ చూపెట్టి మల్లారెడ్డి యూనివర్శిటీకి అనుమతి తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. గజదొంగలను పక్కన పెట్టుకున్న కేటీఆర్... నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంటులో వందల కోట్లు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ నివేదిక బయటకు వచ్చిందని... ఆ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.