Janasena: ఏపీ రోడ్ల దుస్థితిపై సెప్టెంబర్ 2 నుంచి జనసేన పోరాటం

Janasena going to fight on AP roads bad condition

  • రోడ్ల దుస్థితిని వీడియోలు తీసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించండి
  • వీడియోలను డిజిటలైజ్ చేసి ప్రభుత్వాన్ని ఎండగడతాం
  • అక్టోబర్ 2న రోడ్లపై శ్రమదానం చేస్తాం

రాష్ట్రంలో రోడ్లు దారుణంగా తయారయ్యాయని... ఈ దుస్థితిపై జనసేన పోరాటానికి సిద్ధమవుతోందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో జనసేన కార్యకర్తలు, నేతలు, మహిళలు అన్ని జిల్లాల్లో రోడ్ల దుస్థితిపై వీడియోలను తీసి జనసేన కేంద్ర కార్యాలయానికి పంపాలని... ఈ వీడియోలను డిజిటలైజ్ చేసి, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే... కాంట్రాక్టర్లతో సమస్య వచ్చిందా? లేక ప్రభుత్వం నిర్లక్ష్యమే దీనికి కారణమా? అనే విషయం అర్థమవుతుందని చెప్పారు.

అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రతి నియోజకవర్గంలో ఒక రోడ్డును ఎంపిక చేసుకుని శ్రమదానం చేస్తామని తెలిపారు. తమ అధినేత పవన్ కల్యాణ్ రెండు ప్రాంతాలను ఎంపిక చేసుకుని శ్రమదానం చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో రోడ్లున్నాయా? లేక గోతులున్నాయా? అనే విషయం అర్థం కావడం లేదని విమర్శించారు.

జగన్ సీఎం అయిన తర్వాత పెట్రోల్, డీజిల్ పై  విధిస్తున్న సెస్ ఎంత నష్టాన్ని కలిగిస్తున్నాయో అందరికీ తెలుసని చెప్పారు. అయినా జనాలు భరించారని అన్నారు. జనసేన పార్టీ ఫర్ ఆంధ్రప్రదేశ్ (జేఎస్పీ ఫర్ ఏపీ) అనే హ్యాష్ ట్యాగ్ తో రోడ్ల దుస్థితిని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హైలైట్ చేసే ప్రయత్నం చేయబోతున్నామని చెప్పారు. తమ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ పోరాటానికి సిద్ధమవుతున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News