Chris Cairns: గుండెకు శస్త్రచికిత్స చేస్తుండగా పక్షవాతానికి గురైన కివీస్ క్రికెట్ దిగ్గజం కెయిన్స్
- అనారోగ్యంతో బాధపడుతున్న కెయిన్స్
- సిడ్నీలో గుండెకు ఆపరేషన్
- వెన్నెముకలో స్ట్రోక్ వచ్చిందన్న లాయర్
- రెండు కాళ్లు చచ్చుపడిన వైనం
న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ క్రిస్ కెయిన్స్ (51) ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కెయిన్స్ కు ఇవాళ సిడ్నీలో గుండెకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే శస్త్రచికిత్స జరుగుతుండగానే కెయిన్స్ పక్షవాతానికి గురయ్యారు. ఆయన కాళ్లు అచేతనంగా మారిపోయాయి.
ఆపరేషన్ సందర్భంగా కెయిన్స్ వెన్నెముకలో స్ట్రోక్ వచ్చిందని, దాంతో కాళ్లు చచ్చుపడ్డాయని ఆయన లాయర్ ఆరోన్ లాయిడ్ వెల్లడించారు. కెయిన్స్ ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న కాన్ బెర్రాకు తిరిగొచ్చేశాడని, వెన్నెముక నిపుణుల సమక్షంలో ఆయనకు మరింత చికిత్స అవసరమని తెలిపారు.
కాగా, కెయిన్స్ ఆరోగ్య పరిస్థితి విషమించడం పట్ల భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కెయిన్స్ త్వరగా కోలుకోవాలని అభిలషించారు.