YS Jagan: ఏపీహెచ్ బీ గృహ నిర్మాణ ప్రాజెక్టు కేసు చార్జిషీటు నుంచి తన పేరు తొలగించాలన్న సీఎం జగన్
- సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు
- డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- సీబీఐ తప్పుడు అభియోగాలు మోపిందని నివేదన
- ఇదే కేసులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేసిన విజయసాయి
సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజాగా, ఏపీహెచ్ బీ గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసు చార్జిషీటు నుంచి తన పేరు తొలగించాలని సీఎం జగన్ సీబీఐ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన న్యాయస్థానంలో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సీబీఐ తనపై అసత్యపూరిత అభియోగాలు నమోదు చేసిందని కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న అనంతరం సీబీఐ కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 3కి వాయిదా వేసింది.
కాగా, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చార్జిషీటు నుంచి తన పేరు తొలగించాలని కోరారు. ఈ మేరకు డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు.
ఇక, పెన్నా కేసులో సీఎం జగన్ డిశ్చార్జి పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ మరింత సమయం కోరింది. ఈ నేపథ్యంలో, పెన్నా కేసులో తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 1కి వాయిదా వేసింది. పెన్నా చార్జిషీటుకు సంబంధించి తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు వీడీ రాజగోపాల్, శామ్యూల్ కూడా డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారు.