Konda Surekha: ఎల్లుండి హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన
- ఈ నెల 30న మాణికం ఠాగూర్ నేతృత్వంలో కాంగ్రెస్ సమావేశం
- ఆ తర్వాతే అభ్యర్థి పేరు ప్రకటన
- ఇప్పటికే పరిశీలనలో పలువురి పేర్లు
- కొండా సురేఖవైపే అధిష్ఠానం మొగ్గు
హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మళ్లీ గాడిలో పెట్టాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఈ నెల 30న తమ అభ్యర్థిని ప్రకటించనుంది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మాణికం ఠాగూర్ నేతృత్వంలో అదే రోజు జరగనున్న విస్తృతస్థాయి కోర్ కమిటీ సమావేశంలో చర్చించిన అనంతరం అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
హుజూరాబాద్ నుంచి బరిలోకి దిగేందుకు కొండా సురేఖ ఇప్పటికే ముందుకు రాగా, పార్టీ కూడా ఆమెనే పోటీలో నిలపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కొండా సురేఖ పేరుతోపాటు కరీంనగర్, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, కొమరయ్య పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, స్థానిక నేతలైన పత్తి కృష్ణారెడ్డి, రవీందర్ పేర్లను కూడా పరిశీలించినప్పటికీ కొండా సురేఖకే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు సమాచారం.
మరోవైపు, టీఆర్ఎస్ ఇప్పటికే గెల్లు శ్రీనివాస యాదవ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించగా, బీజేపీ నుంచి ఈటల బరిలో ఉన్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన కొండా సురేఖ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగితే పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది.