America: హెచ్చరించినట్టే.. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించిన అమెరికా

US On Drone Strike Against ISIS After Kabul Blasts

  • కాబూల్ ఉగ్రదాడి తర్వాత తీవ్రంగా స్పందించిన జో బైడెన్
  • ఐఎస్-ఖోరాసన్ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్ దాడులు
  • తమ లక్ష్యమైన సూత్రధారి మరణించాడన్న అమెరికా
  • బైడెన్ హెచ్చరిక తర్వాతి రోజే దాడులు

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ విమానాశ్రయం వెలుపల ఇటీవల జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 200 వరకు చేరుకుంది. వీరిలో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఉగ్రదాడిలో తమ సైనికులు మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా హెచ్చరించినట్టుగానే ప్రతీకార చర్యలకు దిగింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఇస్లామిక్ స్టేట్-ఖోరాసన్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా డ్రోన్ దాడులకు పాల్పడింది. కాబూల్ ఉగ్రదాడికి ఇదే సంస్థ బాధ్యత ప్రకటించిన సంగతి తెలిసిందే.

నాంగ్‌హార్ ప్రావిన్స్‌లో అమెరికా వాయుసేన ఈ మానవ రహిత వాయు దాడులకు దిగింది. లక్ష్యాన్ని ఛేదించినట్టు, పేలుళ్లకు సూత్రధారి హతమయ్యాడని సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు. ఈ దాడుల్లో పౌరులకు ఎలాంటి హానీ జరగలేదని పేర్కొన్నారు. కాగా, మొన్నటి ఉగ్రదాడి తర్వాత తీవ్రంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. దాడికి కారణమైన వారిని వెంటాడి వేటాడతామని హెచ్చరించిన మరుసటి రోజే అమెరికా వాయుసేన ఈ దాడులకు పాల్పడడం గమనార్హం.

  • Loading...

More Telugu News