Telangana: పాత బస్తీ, కొత్త సిటీ అన్న తేడా లేకుండా అభివృద్ధి: కేటీఆర్
- చంచల్ గూడలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి
- విడతలవారీగా పంపిణీ చేస్తామని వెల్లడి
- నాణ్యతలో రాజీ పడలేదని కామెంట్
పాత బస్తీ, కొత్త సిటీ అన్న తేడా లేకుండా హైదరాబాద్ ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చంచల్ గూడలోని పిల్లి గుడిసెల బస్తీలో నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇళ్లను ఆయన ఇవాళ ప్రారంభించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మురికివాడగా ఉన్న బస్తీని అందంగా తీర్చిదిద్దామని కేటీఆర్ అన్నారు. రూ.24.91 కోట్లతో ఈ డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించామని చెప్పారు. విడతలవారీగా లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని తెలిపారు. చంచల్ గూడ జైలును తరలించాలన్న విజ్ఞప్తులను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
నగరంలో ఇప్పటిదాకా ఎన్నో డబుల్ బెడ్రూం ఇళ్లను, ఫ్లై ఓవర్ లను నిర్మించామని ఆయన చెప్పారు. రూ.30 లక్షలకుపైగా విలువైన ఇళ్లను ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. నాణ్యతలో రాజీ పడట్లేదని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. 70 ఏళ్లలో కేవలం 3 ఆసుపత్రులే కట్టారని, కానీ, తాము రాబోయే రెండేళ్లలో 4 టిమ్స్ లను కడతామని తెలిపారు.