Sabitha Indra Reddy: సీఎం కేసీఆర్ విద్యార్థుల భవిష్యత్ పై అన్ని విధాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- సెప్టెంబరు 1 నుంచి తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభం
- బాలికల పాఠశాలను పరిశీలించిన సబిత
- సదుపాయాల ఏర్పాట్లపై సూచనలు
- విద్యాసంస్థల ప్రారంభానికి ఇది సరైన సమయం అని వెల్లడి
తెలంగాణలో సెప్టెంబరు 1 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాదులోని బషీర్ బాగ్ లో ఉన్న మహబూబియా బాలికల పాఠశాలను సందర్శించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలో సదుపాయాలు, తీసుకుంటున్న చర్యలు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్ పై అన్ని కోణాల్లో ఆలోచించే సీఎం కేసీఆర్ విద్యాసంస్థలు తెరవాలని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభానికి ఇదే అనువైన సమయం అని భావిస్తున్నామని సబిత పేర్కొన్నారు. విద్యా సంవత్సరం షురూ అవుతున్న నేపథ్యంలో, సెప్టెంబరు 1 నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు ఈ నెల 26 నుంచే స్కూళ్లకు రావాల్సి ఉంటుందని ఆదేశించామని తెలిపారు.