Mamata Banerjee: మమ్మల్ని టార్గెట్ చేయడం వల్ల ఉపయోగం లేదు: మమతా బెనర్జీ
- మమత మేనల్లుడికి సమన్లు జారీ చేసిన ఈడీ
- గుజరాత్ గురించి మాకు తెలుసన్న మమత
- దేశ ఆస్తులను బీజేపీ అమ్మేస్తోందని మండిపాటు
బీజేపీ తమపై కేంద్ర వ్యవస్థలను ఉపయోగిస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. తన మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు ఆయన భార్య రుజిరా బెనర్జీలకు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 6న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సమన్లలో ఈడీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, తమపై ఈడీని ఎందుకు ఉసిగొలుపుతున్నారని మండిపడ్డారు. ఎలా పోరాడాలో తమకు తెలుసని చెప్పారు. గుజరాత్ చరిత్ర ఏమిటో తమకు తెలుసని అన్నారు. బొగ్గు కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదని... బొగ్గు మొత్తం కేంద్రం అధీనంలో ఉంటుందని చెప్పారు. బెంగాల్ కోల్ బెల్ట్ లో లూటీకి పాల్పడిన బీజేపీ మంత్రులు, నేతల విషయం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ప్లాన్ గురించి మాట్లాడుతూ... దేశానికి చెందిన ఆస్తులన్నింటినీ బీజేపీ అమ్మేస్తోందని దుయ్యబట్టారు. రైల్వేలు, ఎయిర్ పోర్టులు, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తోందని మండిపడ్డారు.