Jarvo 69: ఇంగ్లండ్ సిరీస్‌లో గ్రౌండ్లోకి దూసుకొచ్చిన వ్యక్తిపై జీవితకాల నిషేధం!
- లార్డ్స్, హెడింగ్లే టెస్టుల్లో రెండు సార్లు మైదానంలోకి వచ్చిన డేనియల్ జార్విస్
- టీమిండియా ప్లేయర్‌లా ‘జార్విస్ 69’
- జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ప్రకటన
- జరిమానా కూడా ఉంటుందన్న క్రికెట్ క్లబ్
భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ హోరాహోరీగా సాగుతోంది. ఇలాంటి సమయంలో అందరి దృష్టినీ ఆకర్షించింది ఏ బ్యాట్స్‌మనో, బౌలరో కాదు. ఒక ప్రాంక్‌స్టర్! అవును.. లార్డ్స్ టెస్టులో రోహిత్ అవుట్ అవగానే గ్యాలరీ నుంచి హెల్మెట్, ప్యాడ్స్ వేసుకొని మైదానంలోకి వచ్చిన వ్యక్తి గుర్తున్నాడా? అతనే డేనియల్ జార్విస్.
‘జార్విస్ 69’గా పాపులర్ అయిన ఈ యూట్యూబర్.. హెడింగ్లే వేదికగా జరిగిన టెస్టులోనూ కనిపించాడు. మైదానంలో భారత క్రీడాకారుల జెర్సీ ధరించి ఫీల్డింగ్ చేస్తున్నట్లు కనిపించాడు. రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, షమీ కూడా అతన్ని చూశారట. ఆ తర్వాత ఈ యూట్యూబర్‌ను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి అతన్ని మైదానం నుంచి బయటకు పంపేశారు. ఆ సమయంలో జడేజా, సిరాజ్ నవ్వాపుకోలేకపోయారు. ఈ రెండు ఘటనలతో సోషల్ మీడియాలో జార్విస్ పెద్ద సంచలనంగా మారాడు.
భారతీయ ఆటగాడిలా రెండుసార్లు ప్రాంక్ చేసిన జార్విస్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ ఫిర్యాదు చేసిందా? లేదా? అనే విషయంలో సరైన సమాచారం లేదు. కానీ ఈ ప్రాంక్స్‌ను యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ మాత్రం జోక్‌గా తీసుకోలేదు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకొని అతనిపై జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఎప్పటికీ లీడ్స్ గ్యాలరీలోకి జార్విస్ అడుగు పెట్టకుండా నిర్ణయం తీసుకుంది.
‘‘అవును, డేనియల్ జార్విస్‌ను హెడింగ్లేలోకి రాకుండా జీవితకాల నిషేధం విధిస్తున్నాం. అతనిపై జరిమానా కూడా వేస్తాం’’ అని యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ప్రతినిధి వెల్లడించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా మైదానం చుట్టూ స్టెవార్డ్‌లను ఏర్పాటు చేస్తామని, ఎవరైనా మైదానంలోకి రావడానికి ప్రయత్నిస్తే వీరు అడ్డుకుంటారని అధికారులు వివరించారు.