Pawan Kalyan: మరో ఐదు దశాబ్దాల్లో తెలుగు భాష అంతరించిపోయే ప్రమాదం ఉంది: పవన్ కల్యాణ్
- నేడు గిడుగు రామ్మూర్తి జయంతి
- తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న ఉభయ రాష్ట్రాలు
- శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
- తెలుగు భాష ప్రస్తుత పరిస్థితి పట్ల విచారం
ఇవాళ తెలుగు భాషా దినోత్సవం. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో స్పందించారు. సుందర తెలుంగు అని తమిళ కవి బ్రహ్మ సుబ్రహ్మణ్య భారతి కొనియాడారని, దేశ భాషలందు తెలుగులెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారని వివరించారు. ఎంతో ఘనకీర్తి ఉన్న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అల్లుకున్న తెలుగు వారందరికీ తన తరఫున, జనసేన తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.
తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం తెలుగువారి సౌభాగ్యం అని తెలిపారు. ఈనాటి పాలకుల అనాలోచిత చర్యల కారణంగా తెలుగు భాష వాడుక నుంచి కనుమరుగైపోయే ప్రమాదంలో పడిందని పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఓట్ల వ్యామోహంలో పడి కొట్టుకుంటున్నారే తప్ప తెలుగు భాషా పరిరక్షణకు చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు.
ఒకప్పుడు దేశంలో తెలుగు రెండో స్థానంలో ఉండగా ఇప్పుడది ఐదో స్థానానికి పడిపోయిందని వివరించారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో 5 దశాబ్దాల్లో తెలుగు భాష అంతరించిపోతున్న భాషల జాబితాలో చేరే ప్రమాదం ఉందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. మాతృభాషను పరిరక్షించుకోవడానికి తెలుగు వారందరూ నడుంకట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.