Kodandareddy: తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవికి కోదండరెడ్డి రాజీనామా
- తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం
- రాజీనామా లేఖను సోనియాకు పంపిన కోదండరెడ్డి
- కొత్త కమిటీ ఏర్పాటుకు వీలుగా రాజీనామా చేసినట్టు వెల్లడి
- గతంలో కీలక నిర్ణయాలు తీసుకున్న కోదండరెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవికి కోదండరెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. కొత్త క్రమశిక్షణ కమిటీ ఏర్పాటుకు వెసులుబాటు కల్పించేందుకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కోదండరెడ్డి రాజీనామా నేపథ్యంలో త్వరలోనే తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ కొత్త కార్యవర్గం రానుంది. సోనియా ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి కలిగిస్తోంది.
ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై గతంలో కోదండరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతోందని అన్నారు. అంతేకాదు, అప్పట్లో ఉత్తమ్ కుమార్ వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ లోనూ కోదండరెడ్డి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో రాజగోపాల్ రెడ్డికి నోటీసులు పంపారు. ఇటీవల కౌశిక్ రెడ్డి వ్యవహారంలోనూ ఆయన షోకాజ్ నోటీసులు జారీ చేశారు.