Corona Virus: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీలోకి కరోనా!
- కేంద్ర 'ఆయుష్మాన్ భారత్'లో ఇప్పటికే కరోనా చికిత్స
- రాష్ట్రంలో ‘ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్ భారత్’ పేరిట అమలు
- 17 రకాలుగా కరోనా చికిత్స విభజన
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ (ఏబీ)లో కరోనా చికిత్సను ఇప్పటికే చేర్చగా, ఏబీని రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. దీంతో ఇకపై ఈ పథకం ‘ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్’ పేరిట అమలు కానుంది. కరోనా చికిత్సను మొత్తం 17 రకాలుగా విభజించగా, అందులో 14 రకాలకు ప్రభుత్వాసుపత్రులలో వైద్యం అందిస్తారు. క్రమంగా దీనిని ప్రైవేటు ఆసుపత్రులకూ విస్తరిస్తారు.
కాగా, రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలుతో మొత్తం 1,668 జబ్బులకు ఉచిత వైద్యం అందుబాటులోకి వచ్చింది. వీటిలో 642 చికిత్సలను ప్రస్తుతానికి ప్రభుత్వాసుపత్రుల్లోనే అందించాలని నిర్ణయించారు. 50 పడకలున్న ఆసుపత్రులకు మాత్రమే ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి అనుమతి లభిస్తుండగా, ఆయుష్మాన్ భారత్ చేరికతో ఆరు పడకలున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు, 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.