Vizag: హెడ్డింగ్ లో పొరపాటు జరిగింది.. విశాఖ రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వ వివరణ
- లోక్ సభలో ఓ ప్రశ్నకు బదులిచ్చిన కేంద్రం
- ఏపీ రాజధానిగా వైజాగ్ ను పేర్కొన్న వైనం
- పొరపాటు జరిగిందని కేంద్రం వివరణ
ఈ నెల 26న లోక్ సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. ఏపీ రాజధాని విశాఖ అనే భావన వచ్చేలా ఆ సమాధానం ఉంది. దీనిపై దుమారం రేగడంతో కేంద్ర ప్రభుత్వం మళ్లీ క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధాని వైజాగ్ అని చెప్పడం తమ ఉద్దేశం కాదని తెలిపింది. ఏపీలో విశాఖ ఒక నగరం మాత్రమేనని పేర్కొంది. పెట్రోలియం ట్యాక్స్ కు సంబంధించి మాత్రమే విశాఖ పేరును ఉదహరించామని తెలిపింది.
లిఖితపూర్వక సమాధానంలో టేబుల్ కు సంబంధించిన హెడ్డింగ్ లో పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని కేంద్రం చెప్పింది. హెడ్డింగ్ లో క్యాపిటల్ తో పాటు, సమాచారం సేకరించిన నగరం పేరును కూడా చేర్చుతున్నామని తెలిపింది. దీనికి సంబంధించి ఇప్పటికే లోక్ సభ సచివాలయానికి సమాచారం కూడా ఇచ్చామని చెప్పింది. కేంద్రం ఇచ్చిన క్లారిటీతో వివాదం సద్దుమణిగింది.