Avani Lekhara: పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేతకు ఏపీ సీఎం జగన్ అభినందనలు
- టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణం
- షూటింగ్ లో పసిడి నెగ్గిన అవని లేఖర
- చరిత్ర సృష్టించిందన్న సీఎం జగన్
- మరెన్నో పతకాలు గెలవాలని ఆకాంక్ష
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు తొలి పసిడి లభించడం తెలిసిందే. 10 మీటర్ల షూటింగ్ అంశంలో అవని లేఖర అద్భుతమైన ప్రతిభ కనబరిచి స్వర్ణం సాధించింది. దీనిపై ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియాలో స్పందించారు. పారాలింపిక్స్ లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళ అవని లేఖరకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అవని లేఖర తన అసమాన ప్రదర్శనతో భారత క్రీడలు, అథ్లెటిక్స్ రంగంలో చరిత్ర సృష్టించిందని కొనియాడారు. అవని లేఖర ఇదే విధంగా రాణించాలని, దేశానికి మరిన్ని విజయాలు అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా భారత పారాలింపిక్ బృందం మొత్తాన్ని అభినందిస్తున్నట్టు సీఎం జగన్ పేర్కొన్నారు. టోక్యో పారాలింపిక్స్ లో అమోఘమైన రీతిలో ఫలితాలు సాధిస్తున్నారని, దాని ఫలితమే భారత్ కు ఇప్పటివరకు 7 పతకాలు వచ్చాయని వివరించారు. అంతేకాదు, మనవాళ్లు మరిన్ని పతకాలను గెలుస్తారని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.