Taliban: అమ్మాయిలకు మగ టీచర్లు చదువు చెప్పకూడదు.. తాలిబన్ల నయా రూల్!

New Taliban rule to Male teachers should not teach girls to read
  • కో-ఎడ్యుకేషన్ విధానంపైనా నిషేధం
  • షరియా చట్టాల ప్రకారమే విద్య
  • ఆఫ్ఘన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్ అబ్దుల్ బాకీ హక్కానీ ప్రకటన
తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో రోజుకో కొత్త రూల్ వినిపిస్తోంది. తాము మారిపోయామని, పాత పద్ధతులు అమలు చేయబోమని కొన్ని రోజుల క్రితం తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిణామాలు చూస్తే మాత్రం.. ఈ ఉగ్రవాదులు మళ్లీ తమ అరాచక పాలన ప్రారంభిస్తున్నట్లే కనిపిస్తోంది. తాజాగా విద్యా వ్యవస్థపై తాలిబన్లు ఆంక్షలు విధించడం ప్రారంభించారు. గతంలో హెరాత్ ప్రావిన్స్‌లో ఉన్న యూనివర్సిటీల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకునే కో-ఎడ్యుకేషన్ విధానాన్ని తాలిబన్లు రద్దు చేశారు.

ఇప్పుడు తాజాగా ఆఫ్ఘనిస్థాన్ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో ఎక్కడా ఆడపిల్లలకు మగ టీచర్లు చదువు చెప్పకూడదని తాలిబన్లు రూల్ తెచ్చారు. ఈ మేరకు ఆఫ్ఘన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్ అబ్దుల్ బాకీ హక్కానీ ఒక ప్రకటన చేశారు. కో-ఎడ్యుకేషన్ విధానాన్ని కూడా దేశవ్యాప్తంగా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. షరియా చట్టం ప్రకారమే విద్యాసంస్థలు తమ కార్యకలాపాలు సాగించాలని స్పష్టం చేశారు.

ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియామకం జరిగిన మరుసటి రోజే హక్కానీ ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘన్‌లో విద్యా వ్యవస్థను మెరుగు పరిచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని హక్కానీ అన్నారు. ఇప్పటి వరకూ నడిచిన విద్యా వ్యవస్థ షరియా చట్టాలకు విరుద్ధంగా నడిచిందని విమర్శించారు. అయితే తాలిబన్ల ఈ నిర్ణయాల పట్ల టీచర్లు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే బాలికలకు విద్య మరింత దూరమవుతుందని అంటున్నారు.
Taliban
Afghanistan
Teachers
Girls

More Telugu News