America: గడువు తేదీలోపే ఆఫ్ఘనిస్థాన్‌ను ఖాళీ చేసిన అమెరికా.. అర్ధరాత్రి వెళ్లిపోయిన చివరి విమానం!
- ఆఫ్ఘన్‌ను ఖాళీ చేసినట్టు ప్రకటించిన అమెరికా రక్షణ శాఖ
- దళాలు, పౌరుల ఉపసంహరణలో తాలిబన్లు బాగా సహకరించారని ప్రశంస
- తుపాకులతో గాల్లోకి కాల్చి సంబరాలు చేసుకున్న తాలిబన్లు
అమెరికా మాట నిలబెట్టుకుంది. ఇచ్చిన గడువులోపే ఆఫ్ఘనిస్థాన్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయింది. 20 ఏళ్ల క్రితం కల్లోలంగా ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌లో అడుగుపెట్టిన అమెరికా.. నేడు అదే స్థితిలో దానిని వదిలేసి వెళ్లిపోయింది. రక్షణ దళాలతో కూడిన అమెరికా చివరి విమానం గత అర్ధరాత్రి కాబూల్ నుంచి బయలుదేరింది. అమెరికా రక్షణ శాఖ కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది.
సైనికులు, పౌరులతో కూడిన చివరి విమానం లార్జ్ సి-17 కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం అర్ధరాత్రి బయలుదేరిందని, దీంతో ఆఫ్ఘన్‌లోని సైనికులు, పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయిందని, అమెరికా సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ మెకంజీ పెంటగాన్‌లో ప్రకటించారు. అమెరికా సైన్యం, తాలిబన్ల మధ్య తొలి నుంచీ తీవ్ర శత్రుత్వం ఉన్నప్పటికీ తమ దళాలు, పౌరుల ఉపసంహరణలో తాలిబన్లు బాగా సహకరించారని మెకంజీ పేర్కొన్నారు.
ఇక, రెండు దశాబ్దాల తర్వాత ఆఫ్ఘన్ గడ్డపై ఉన్న అమెరికా దళాలు ఖాళీ చేసి వెళ్లిపోయిన తర్వాత తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. తుపాకులతో గాల్లోకి కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.