Afghanistan: ప్రపంచం మమ్మల్ని చూసి నేర్చుకోవాలి.. విజయగర్వంలో తాలిబన్లు
- కాబూల్ విమానాశ్రయమంతా కలియతిరిగిన తాలిబన్లు
- తమకు ఆనందించదగిన క్షణమన్న జబీహుల్లా ముజాహిద్
- అన్ని దేశాలతో తమకు సంబంధాలు కావాలని వెల్లడి
20 ఏళ్ల యుద్ధానికి అమెరికా చరమగీతం పాడేయడంతో తాలిబన్లు విజయగర్వంతో ఉప్పొంగిపోతున్నారు. అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం తాలిబన్లు కాబూల్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్నారు. రన్ వే, టార్మాక్ లపై కలియతిరుగుతూ సింహనాదాలు చేశారు. గాల్లోకి తుపాకులు పేల్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ఈ విజయం ఆఫ్ఘన్లందరిదని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అన్నారు. తమకు అన్ని దేశాలతోనూ మంచి దౌత్య సంబంధాలు కావాలని అన్నారు. ప్రపంచం మొత్తం తమ నుంచి పాఠం నేర్చుకోవాలని, ఇది తమకు ఎంతో ఆనందించదగిన క్షణమని అన్నారు.
ఇదిలావుంచితే, తాలిబన్లు ప్రపంచం విశ్వాసం పొందాలంటే ముందు కచ్చితంగా వారు ఉగ్రవాదంపై పోరాడాలని, ప్రయాణ స్వేచ్ఛను పాటించాలని, ఆఫ్ఘన్ ప్రజలు, మహిళలు, మైనారిటీల హక్కులను కాపాడాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు.