Telangana: మంత్రి మల్లారెడ్డికి మరో తలనొప్పి.. ‘వాసన’ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
- మొన్న జవహర్ నగర్ లో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ
- వాసన దమ్మాయిగూడవైపు పోతోందని కామెంట్లు
- జవహర్ నగర్ ప్రజల అదృష్టమంటూ వ్యాఖ్యలు
- మండిపడిన డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట సమితి
- దమ్మాయిగూడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి మరో తలనొప్పి వచ్చి పడింది. మొన్న ఆదివారం హైదరాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లు వస్తున్నాయి.
విగ్రహావిష్కరణ సభలో మాట్లాడిన మల్లారెడ్డి.. ‘‘మీకు అన్ని వసతులు కల్పిస్తాను. ఇంకో అదృష్టమేంటంటే డంపింగ్ యార్డ్ వాసన జవహర్ నగర్ వైపు లేదిప్పుడు. దమ్మాయిగూడ దిక్కు వెళ్లింది’’ అంటూ నవ్వేశారు. ఈ వ్యాఖ్యలపై డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట సమితి మండిపడింది. దమ్మాయిగూడ ప్రజలను అవమానించేలా మంత్రి వ్యాఖ్యలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
దమ్మాయిగూడ ప్రజలకు కంపు వాసన వస్తే మంత్రిగారికి అదృష్టమా? అంటూ సమితి కో కన్వీనర్ కేతేపల్లి పద్మాచారి నిలదీశారు. వాసన ఎటు గాలి ఉంటే అటు పోతుందని అన్నారు. ఎక్కడికిపోతే అక్కడ ఆ పాట పాడుతున్నారని, జనాలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకరిని ప్రశంసించి.. మరొకరిని కించపరచడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. వెంటనే మంత్రి మల్లారెడ్డి క్షమాపణ చెప్పాలని, వెంటనే డంపింగ్ యార్డ్ ను మూసేయాలని డిమాండ్ చేశారు.